అవసరంలేని స్థాయిలో డిజిటల్ వ్యవసాయానికి ప్రోత్సాహం.. రోజురోజుకూ  సంక్షోభంలో రైతాంగం

అవసరంలేని స్థాయిలో డిజిటల్ వ్యవసాయానికి ప్రోత్సాహం.. రోజురోజుకూ  సంక్షోభంలో రైతాంగం

ప్రపంచంలో యుద్ధాలు, వాణిజ్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత వ్యవసాయంలో సమూల పరివర్తన అవసరం ఉన్నది. దాదాపు అన్ని రాష్ట్రాలలో రైతాంగం రోజురోజుకూ  సంక్షోభంలో  కూరుకుపోతున్నది. ఈ దశలో  మార్పు  ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనేది కీలకంగా మారింది.  సంపూర్ణ మార్పు కేంద్ర ప్రభుత్వ విధానాలలో రావాల్సిన అవసరం ఉన్నది. 

 కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం ద్వారా ఈ మార్పుకు నాంది పలకాలి. బడ్జెట్  కేటాయింపుల ద్వారా  ఈ మార్పుకు  అవసరమైన  నిధులు  అందజేయాలి.  కానీ,   ఆమేరకు విధాన మార్పులు లేవు.  కేటాయింపులు లేవు.  కేటాయింపులు ఎన్ని ఉన్నా..  ప్రభుత్వ ఆలోచనలలో మార్పులు రాలేదు అని అర్థం అవుతోంది.  రైతుల సగటు ఆదాయం పెరగలేదు.  రెట్టింపు అసలే కాలేదు.  ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది.  ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి.  దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఆహార దిగుమతులు పెరుగుతున్నాయి.

డిజిటల్ వ్యవసాయం ద్వారా  అద్భుతం  సాధిస్తున్నామని చెబుతున్న  కేంద్ర ప్రభుత్వ ధోరణి  భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల ప్రతిస్పందన దాదాపు శూన్యం.  వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి,  తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా  రైతు ఆదాయం  తగ్గుతున్నది.   పెరుగుతున్న  వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి, ఐరోపా దేశాల నుంచి  పెరుగుతున్న  ఒత్తిళ్లను  ఆర్థికసర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో  కనీస స్పందన లేదు.  

పెరుగుతున్న  వాతావరణ  ప్రభావానికి,  ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు.  విపరీత వర్షాలకు,  అకాల వర్షాలకు, చీడపీడలకు, తరుగు తున్న  సంకర విత్తనాల నాణ్యత పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.  ఆశించినట్టుగా 2026–27 బడ్జెట్లో  సహజ వ్యవసాయం వంటి  వినూత్న కార్యక్రమాలకు  నిధులను  గణనీయంగా పెంచలేదు.  

రానురాను  డిజిటల్  వ్యవసాయం పేరిట పెంచుతున్న కేటాయింపులు,  డిజిటల్  వ్యవసాయం మీద  పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ.  ఈ  పెట్టుబడులు కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికకు మాత్రమే పనికి వస్తాయి. 

ధర నిర్ణయించే శక్తి లేని డేటా

ప్రభుత్వ లెక్కల ప్రకారం పంటల పరిమాణం పెరుగుతున్నది.  సుస్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభం పరిష్కరించడంలో గత పదేండ్ల నుంచి  తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. మార్కెట్లో  రైతుకు గిట్టుబాటు ధర అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ–ఎన్ఏఎం,  ధరల  డాష్‌బోర్డ్​లు,  గిడ్డంగి రసీదు  వ్యవస్థలు  వంటి  డిజిటల్  ప్లాట్‌ఫామ్‌లు  రైతుల సమస్యలను పరిష్కారం చేయడం లేదు. వాటి మీద సమీక్ష లేదు. ఆయా డిజిటల్  పథకాల అమలు గురించిన సలహాలు స్వీకరించడానికి  రైతులతో  సంప్రదింపులు లేవు. 

 ధరల స్థిరీకరణ, కనీస మద్దతు ధర,  వివిధ పంటల సేకరణ, వ్యవసాయ  ఉత్పత్తుల  ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో  బలమైన  ప్రభుత్వ జోక్యం లేకుండా,  డిజిటల్ వ్యవస్థలు రైతులను ఆదాయాలను ప్రభావితం చేయలేవు.  ఈ  డిజిటల్  వ్యవస్థలు  రక్షించడం కంటే అస్థిర ధరలకు మరింత ఊతంగా మారే  ప్రమాదం ఉంది.  కేంద్ర ప్రభుత్వం  అసలు  పరిష్కారాల స్థానంలో  మభ్యపెట్టే  డిజిటల్ పథకాలు పెట్టి, కేటాయింపులు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నది.

నామమాత్రంగా వ్యవసాయ బడ్జెట్​లో  వృద్ధి 

రాబోయే సంవత్సరంలో వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర బడ్జెట్ రూ.1,30,561 కోట్లు (సవరించిన 2025-–26 నుంచి 6% ఎక్కువ). ఇందులో భారీ కేటాయింపులు.. పీఎం- కిసాన్ (రైతు ఆదాయ మద్దతు) రూ.63,500 కోట్లు (49%),  వడ్డీ సబ్సిడీలు (MISS) రూ.22,600 కోట్లు (17%),  పంట బీమా (PMFBY) రూ.12,200 కోట్లు (9%).    మొత్తం  కేంద్ర బడ్జెట్  రూ.48.55 లక్షల కోట్లలో  వ్యవసాయ శాఖకు ఇచ్చింది  కేవలం 2.7 శాతం.  బడ్జెట్ ప్రాధాన్యతలతో  పోలిస్తే   ప్రభుత్వం  రూ.14.4 లక్షల కోట్లు వడ్డీ రూపంలోనే  చెల్లిస్తుంటే ( జీడీపీలో 11%), వ్యవసాయానికి  రూ.1.3 లక్షల కోట్లు మొత్తం ( జీడీపీలో <1%). భారతదేశం ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం వల్ల వ్యవసాయ అభివృద్ధి మీద వ్యయం 
స్పష్టంగా పరిమితం అవుతున్నది. 

వ్యవసాయ బడ్జెట్లో వృద్ధి చాలా  తక్కువ.  వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం  కేవలం రూ.33,000 కోట్లు మాత్రమే. ఇది  ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై ఖర్చు చేసే దానికంటే తక్కువ.  క్రిషియోన్నతి యోజనకు 65% పెరుగుదల ( రూ.6,800 –  రూ.11,200 కోట్లు). ఇందులో కొత్తగా కూరగాయలు/పండ్ల మిషన్‌ పథకాన్ని చేర్చారు. సహజ వ్యవసాయ మిషన్​కు  ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి ఉన్నది  ( రూ.725–రూ.750 కోట్లు). ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41%.  ఈ పథకాలను రాష్ట్రాలు సమర్థంగా ఉపయోగించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాల మధ్య ఈ పథకాల అమలు ఆశించిన స్థాయిలో లేదు.

ఆహార భద్రతపై  నిర్లక్ష్యం

వ్యవసాయం అందించే ఆహార భద్రత పట్ల కేంద్ర బడ్జెట్లో విధానం లక్షలాది మంది భారతీయ కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవాలకు దూరంగా ఉన్నది.  ఆర్థిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా సాధారణ కుటుంబాలను పీడిస్తున్న ఆహార లభ్యత,  పోషక సమృద్ధి, కొనుగోలు సామర్థ్యం వంటి ప్రాథమిక సవాళ్ల పట్ల బడ్జెట్ ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోంది. 

 రైతులకు ఆదాయం రావడం లేదు. వినియోగదారులకు ఆహారం మీద ఖర్చు పెరుగుతున్నది. ఈ వైరుధ్యాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆహారం, పోషకాహార కొరత తీవ్రత తక్షణ విధాన జోక్యాన్ని గుర్తు చేస్తున్నది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు ఈ దిశగా కూడా లేవు.  పోషకాలతో కూడిన ఆహారం తక్కువ, మధ్య-  ఆదాయ కుటుంబాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నది. 

అవసరమైన పండ్లు చాలా మందికి  విలాసవంతమైన  వస్తువులుగా మారుతున్న దశలో సమతుల్య ఆహారం లక్ష్యం కూడా అస్పష్టంగానే ఉంది. ఒకప్పుడు స్థానిక ఆహారంలో ప్రధానమైన సీతాఫల పండ్లు, అరటి పండు వంటి పోషకాలతో కూడిన దేశీయ పండ్లు ఇప్పుడు లెక్కలేనన్ని కుటుంబాలకు అందుబాటులో లేవు.  ఆపిల్,  ద్రాక్ష, తీపి నారింజ వంటి ముఖ్యమైన  పండ్ల  పంటల విస్తీర్ణం తగ్గింది.  అయినా కేంద్ర బడ్జెట్ వాటి గురించి కనీస ప్రస్తావన చేయలేదు. 

 రైతుకు మార్కెట్ ధర గిట్టుబాటు కాకపోవడం, దోపిడీ మార్కెట్ సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు, మౌలిక సదుపాయాల మీద  పెట్టుబడి లేకపోవడంతో సహా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. ఈ ధోరణులను తిప్పికొట్టడంలో బడ్జెట్ వైఫల్యం దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. నిజంగా ప్రగతిశీల బడ్జెట్ వ్యవసాయ విధానంలో పునరాలోచనలు కాకుండా, అందుబాటులో ఉన్న, సరసమైన, సురక్షితమైన పోషకాహారాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలి.

కేంద్రం అస్థిర ఆలోచనలు

రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాటన్ టెక్నాలజీ మిషన్, పప్పుధాన్యాల మిషన్, హైబ్రిడ్ సీడ్స్ మిషన్ (2025-26లో  రూ.1,700 కోట్లు ) వంటి వాటికి  2026-27లో కేటాయింపులు లేవు. వాటి స్థానంలో కొత్త పథకాలు కూడా లేవు.  కాటన్  టెక్నాలజీ మిషన్ పథకానికి గతంలో  రూ.500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సున్నాకు తెచ్చింది. ఎందువల్ల? ఎట్లాంటి వివరణ ప్రభుత్వం నుంచి రాలేదు. పప్పుల దిగుమతులు పెరుగుతున్న దశలో దేశీయంగా పప్పుల ఉత్పత్తి పెంచుదామని అనుకుని పప్పుధాన్యాల మిషన్​కు గత ఏడాది రూ.1000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈసారి దాన్ని సున్నాకు చేర్చింది.

 అన్ని పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత పేరు మీద స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా (ప్రత్యేక దృష్టి కంది, మినప్పప్పు, పెసరపప్పు) పంట సేకరణతోపాటు గిడ్డంగుల ఏర్పాటు కోసం తెచ్చిన పథకం. 2025–26 నుంచి 2030–31 వరకు  రూ.11,440 కోట్ల బడ్జెట్ వ్యయంతో పప్పుధాన్యాల రంగంలో ఆత్మనిర్భరత మిషన్ (పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్) అధికారికంగా 2025 అక్టోబర్‌లో ఆమోదించడమైనది. ఈ మిషన్‌కు 6 సంవత్సరాల ప్యాకేజీ ఇస్తూ, మొదటి సంవత్సరం రూ.1,000 కోట్లు ఇచ్చి రెండో సంవత్సరం సున్నా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అస్థిర ఆలోచనలు బట్టబయలు అవుతున్నాయి. 

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-